
అమెరికాను తూట్లు పొడుస్తున్న తుపాకీ సంస్కృతి తెలుగు బిడ్డలను పొట్టన బెట్టుకుంది. మేధకు విలువనిచ్చే గడ్డగా నమ్మి కోటి ఆశలతో పరిశోధన విద్యార్థులుగా అమెరికాను చేరిన కిరణ్, చంద్రశేఖరరెడ్డిలు లూసియానా విశ్వవిద్యాలయంలో దారుణ హత్యకు గురయ్యారు. కొత్తగా పెళ్లయిన చంద్రశేఖర్, త్వరలో తండ్రవుతున్న కిరణ్‌ల కుటుంబాల్లో నిన్నటి వరకు అంబరాన్నంటే ఆనందం... నేడు కటిక చీకటిలాంటి విషాదం. ఈ దారుణం అమెరికా ప్రవాసాంధ్రులను... రాష్ట్రంలోని వారి కుటుంబాలను కలవర పెడుతోంది.
బేటన్ రూగ్ (లూసియానా)

అమెరికాలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ యువకులు దారుణ హత్యకు గురయ్యారు. లూసియానా రాష్ట్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న అల్లం కిరణ్‌కుమార్, కొమ్మా చంద్రశేఖరరెడ్డిలను గుర్తుతెలియని దుండగులు చంపారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు అపార్ట్‌మెంటులోకి చొరబడి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కిరణ్‌కుమార్ కరీంనగర్ జిల్లాకు చెందినవారు. ప్రఖ్యాత తెలుగు రచయిత అల్లం రాజయ్య కుమారుడు. చంద్రశేఖరరెడ్డిది కడప జిల్లా పులివెందుల. ఇద్దరూ స్నేహితులు. 29-30 ఏళ్ల వయసుంటుంది. వివాహితులు కూడా. కిరణ్ రసాయన శాస్త్రంలో, చంద్రశేఖరరెడ్డి బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. భార్యలతో విశ్వవిద్యాలయం ఆవరణలోని వేర్వేరు అపార్ట్‌మెంట్లలో ఉంటున్నారు. ఉభయుల ఇళ్ల నడుమ దూరం నాలుగు మైళ్లవరకు ఉంటుంది. ఎడ్వర్డ్ గే కాంప్లెక్స్‌లోని కిరణ్‌కుమార్ అపార్ట్‌మెంటులో ఈ హత్యలు జరిగాయి. చంద్రశేఖరరెడ్డిని కేబుల్ తీగలతో బంధించి తలపై కాల్చారు. కిరణ్ తలపైనా కాల్చారు. ఆయన మృతదేహం ద్వారం వద్ద పడిఉంది. కిరణ్ భార్య స్వప్న (ప్రస్తుతం గర్భిణి) బయట నుంచి ఇంటికొచ్చాక వీరి మృతదేహాలను కనుగొని పోలీసులకు సమాచారం అందించారని చంద్రశేఖరరెడ్డి స్నేహితుడు పోతకమూరి శ్రీనివాస్ తెలిపారు. ముగ్గురు ఆగంతకులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోతూ కనిపించారని, వారికోసం గాలిస్తున్నామని, ఇంతవరకు ఎవరినీ అరెస్టుచేయలేదని పోలీసులు వెల్లడించారు. చంద్రశేఖరరెడ్డికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లయింది. భార్య పేరు కల్పన. ఆమె శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని తన తండ్రి దామోదర్‌రెడ్డికి ఫోను చేసి సంఘటన గురించి చెప్పారు. ముగ్గురు నల్లజాతీయులు కాల్పులు జరిపినట్లు ఆమె తెలిపారు. లూసియానా విశ్వవిద్యాలయంలో ఇలాంటి సంఘటన జరగడం 1990 తర్వాత ఇదే మొదటిసారి అని విశ్వవిద్యాలయ ప్రతినిధి క్రిస్టీన్ కొలోన్ తెలిపారు. క్యాంపస్‌లో 30 వేల మంది విద్యార్థులున్నారు. వారి నివాసాల్లో ఏదైనా జరగరానిది జరిగితే అత్యవసరంగా సమాచారం పంపే అప్రమత్త వ్యవస్థను ఈ మధ్యనే ఏర్పాటుచేశారు. వర్జీనియాటెక్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది మొదట్లో ఓ వ్యక్తి 32 మందిని చంపి తానూ కాల్చుకున్న ఘటన తర్వాత ఈ వ్యవస్థను అందరు విద్యార్థులకు తప్పనిసరి చేశారు. కొందరికి మాత్రం ఈ సదుపాయం అందలేదు. ఎందుకిలా జరిగిందో దర్యాప్తు జరుపుతున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. ఒకరికి కొత్తగా పెళ్లి.. మరొకరు తండ్రి కాబోతున్నారు
మధుర వూహల వేళ మరణ మృదంగం సొంత వూళ్లో అలముకున్న విషాదం
కర్నూలు, మంథని, లింగాల, న్యూస్‌టుడే: అమెరికాలోని లూసియానా విశ్వవిద్యాలయంలో హత్యకు గురయిన తెలుగుబిడ్డలు కె.చంద్రశేఖర్‌రెడ్డి, అల్లం కిరణ్‌ల సొంత వూళ్లయిన కర్నూలు, కరీంనగర్ జిల్లా మంథనిలలో విషాదం అలముకొంది. ఇద్దరూ వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అత్యంత ఆనందకర స్థాయులను అందుకున్న తరుణంలో జరిగిన ఈ సంఘటన ఆప్తులకు మింగుడు పడటంలేదు.
కరవుసీమ నుంచి పరిశోధన విద్యార్థిగా అమెరికా వెళ్లిన చంద్రశేఖర్ మరణం కుటుంబానికి పిడుగైంది. కళ్లల్లో ఉబికివస్తోన్న కన్నీళ్లు... హృదయాంతరాల్లో సుడులు తిరుగుతోన్న దుఃఖాన్ని... గొంతు దాటకుండా... పెదవి విప్పకుండా... ఆరు గంటలుగా ఆ కుటుంబం పడుతోన్న వేదన అంతాఇంతా కాదు. గొంతులోని భావం... నోట వెంట మాటగా మారితే... తండ్రి ప్రాణానికి పెద్ద ఇబ్బంది కావడంతో ఆ కుటుంబం నిజాన్ని దాచి నిస్తేజంగా కుమిలిపోతోంది. తొమ్మిది నెలల కిందట తన చేతులు మీదుగా మరిది పెళ్లి చేసిన ఆ వదినకు... ఆ తీపి జ్ఞాపకాలు ఇంకా వీడక ముందే శరాఘాతం.. చంద్ర మరణవార్తతో చేష్టలుడిగిన ఆమె ఆక్రోశానికి అంతు లేదు. ఓదార్చేందుకు వస్తోన్న ఇరుగు-పొరుగును ఇంట్లో పరిస్థితి చెప్పలేక ఎనిమిదో తరగతి చుదువుతున్న చిన్నారి కష్టాలు అన్నీఇన్నీ కావు.
చదువు పూర్తయి: కర్నూలుకు చెందిన కె. చంద్రశేఖర్‌రెడ్డి(బుజ్జి) ఉన్నత విద్యను అభ్యసించడానికి ఐదేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కల్పనతో తొమ్మిది నెలల కిందటే వివాహం జరిగింది. ఆ సమయంలో కర్నూలు వచ్చిన ఆయన నెల రోజులపాటు ఇక్కడే ఉండి... భార్యతో అమెరికాకు వెళ్లిపోయారు. పదిరోజుల కిందటే పీహెచ్‌డీ పూర్తి అయి... డాక్టరేట్ వచ్చినట్లు తమకు ఫోన్ చేసినట్లు బుజ్జి రెండో అన్న విశ్వనాధరెడ్డి చెప్పారు. కడపజిల్లా పులివెందులకు సమీపంలోని వెలిదెండ్ల గ్రామానికి చెందిన సాంబశివారెడ్డి మూడో కుమారుడే ఈ చంద్రశేఖర్. అటవీశాఖలో ఉద్యోగం చేసేందుకు 30 ఏళ్ల కిందట ఆయన కర్నూలుకు వచ్చి.. ఇక్కడే స్థిరపడ్డారు. బుజ్జికి ఇద్దరు అన్నలు. ఇద్దరు అక్కలున్నారు. ఒకరు మినహా మిగిలిన వారందరూ హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తోన్నారు.
ఆ ఇబ్బందితో..: గుర్తుతెలీని దుండగుల కాల్పుల్లో మరణించిన వార్త విని చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు స్థాణువులయ్యారు. వెంటనే ఇంట్లోని కేబుల్ వైర్‌ని కట్ చేశారు. 'నాన్నకు గుండె ఆపరేషన్ చేశారు. హఠాత్తుగా తమ్ముడి గురించి చెబితే ఆయనకేమైనా కావొచ్చు. అందుకే ఇప్పటి వరకూ ఏమీ చెప్పలేదు. సమయానికి అమ్మ కూడా లేదు. పొలం పనులు చూసేందుకు వూరికి వెళ్లింది. ఆమెకు కూడా తమ్ముడి విషయం చెప్పకుండా... అక్కకు ఒంట్లో బాగోలేదు... హైదరాబాద్‌కు వెళ్లాలని చెప్పాం. ఆమె వూరి నుంచి బయలుదేరింది' అంటూ అన్న విశ్వనాధరెడ్డి చెప్పారు. బుజ్జి మరణవార్త గురించి మీడియాలో వచ్చిన కథనాలతో తెలుసుకున్న ఇరుగు.. పొరుగు పరామర్శించేందుకు రావడంతో 'ఇంట్లో పరిస్థితిని' వివరించి బయటనుంచే పంపిస్తున్నారు. తర్వాత తల్లిదండ్రులకు విషయం చెప్పారు.
తల్లిదండ్రులను అమెరికా తీసుకెళ్లాలని: 'అమ్మా.. నాన్నా.. మీకు ఇక ఏ కష్టమూ రాదు. నేనున్నాను.. మిమ్మల్ని కూడా అమెరికా తీసుకెళ్తాను' అని తల్లిదండ్రులతో చెప్పిన చంద్రశేఖర్‌రెడ్డి వారిని అక్కడికి తీసుకువెళ్లకుండానే తుపాకీ తూటాలకు బలయ్యాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. మా ఇద్దరినీ అమెరికా తీసుకెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవలే చెప్పాడని మృతుని తల్లిదండ్రులు సాంబశివారెడ్డి, మీనాక్షమ్మ కన్నీళ్లపర్యంతమవుతూ చెప్పారు. ప్రయోజకుడవుతున్నాడని సంతోషంతో వూగిసలాడుతున్న వారికి కుమారుని మరణవార్త గుండెలు పగిలేలా తాకింది. మరో రెండు నెలల్లో తమ్ముడి దగ్గరకు అమ్మా, నాన్నలు వెళ్లనున్నట్లు విశ్వనాథరెడ్డి చెప్పారు. 'ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది' అంటూ ఉబికి వస్తోన్న కన్నీళ్లను ఆపుకొంటూ చెప్పారు. తమ తమ్ముడి భౌతికకాయాన్ని తమకు అప్పగిస్తారా? ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకుంటుందా? అంటూ ఆ అన్నా... వదినలు అడుగుతున్న తీరు గుండెల్ని పిండేలా ఉంది.
తోబుట్టువులు అక్కడే: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన కిరణ్ మృతి ఆయన సొంత వూరయిన కరీంనగర్ జిల్లా మంథని మండలం గాజులపల్లి ప్రజల్ని కలచివేసింది. కిరణ్ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఇంటర్, వరంగల్‌లో డిగ్రీ, హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ చదివారు. నాలుగేళ్ల క్రితం లూసియానా విశ్వవిద్యాలయంలో పారిశ్రామిక రసాయన శాస్త్రంలో పరిశోధన కోసం వెళ్లి పూర్తి చేశారు. వచ్చే ఏడాది జూన్‌లో స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. కిరణ్ భార్య స్వప్న ప్రస్తుతం గర్భిణి. కిరణ్ తల్లి, అక్కాచెల్లెళ్లు రజని, చందన, బావలు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కిరణ్ బంధువులు మంథనిలో శోక సముద్రంలో మునిగారు. కిరణ్ తండ్రి అల్లం రాజయ్య(విరసం సభ్యుడు) హుటాహుటిన శుక్రవారం రాత్రి అమెరికా బయల్దేరివెళ్లారు.హైదరాబాద్‌కు చెందిన స్వప్నతో రెండేళ్ల క్రితం కిరణ్‌కు వివాహం జరిగింది. కిరణ్ నాలుగేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు
1 comment:
i am in love with this blog, love the article
cinemaceleb.com
Post a Comment