
అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు విద్యాసుమాలు నేలరాలాయి. విద్యార్జనకు వెళ్లిన ఇద్దరు యువకులు అర్ధాంతరంగా తనువు చాలించారు. దుండగుల తూటాలకు బలయ్యారు. మృతులను అల్లం కిరణ్ కుమార్, కొమ్మ చంద్రశేఖర్ రెడ్డిగా గుర్తించారు. కిరణ్ ప్రముఖ కథా రచయిత అల్లం రాజయ్య ఏకైక కుమారుడు. ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా మంథని మండలంలోని గాజులపల్లి. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు కడప జిల్లా లింగాలకు చెందినవారు.
హైదరాబాద్, డిసెంబర్ 14 (ఆన్‌లైన్): దుండగుల కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయిన కిరణ్, చంద్రశేఖర్‌లు అమెరికాలోని లూసియానా వర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇద్దరూ మిత్రులు. కిరణ్‌కు రెండేళ్ల క్రితమే పెళ్లయింది. భార్య స్వప్న ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. చంద్రశేఖర్ కూడా వివాహితుడే.ఆయన భార్య అక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారు. పెళ్లయిన వారు నివసించడానికి యూనివర్సిటీలో ప్రత్యేకించిన అపార్ట్‌మెంట్స్‌లో వీరు ఉంటున్నారు. కిరణ్ తన భార్యతోపాటు మరో ఇంట్లో ఉన్నా... రీసెర్చ్ పని ఉన్నప్పుడు రాత్రిళ్లు వర్సిటీ అపార్ట్‌మెంట్లోనే ఉంటుంటారు.
గురువారం రాత్రి చంద్రశేఖర్ కూడా కిరణ్ అపార్ట్‌మెంట్‌లోనే ఉన్నారు.ముగ్గురు దుండగులు ఇంట్లోకి చొరబడి... వచ్చీ రాగానే కాల్పులు జరిపారు. చంద్రశేఖర్ మెడకు కేబుల్ తీగ చుట్టి మరీ చంపారు. ఇద్దరి తలల్లో ఒక్కో బుల్లెట్ పేల్చారు. కిరణ్ మృతదేహం తలుపు వద్ద పడి ఉంది. ఆయన భార్య స్వప్న రాత్రి 10.30 గంటల సమయంలో వర్సిటీ అపార్ట్‌మెంట్‌కు వచ్చారు.భర్త, అతని మిత్రుడు విగత జీవులై ఉండటం చూసి ద్రిగ్భాంతికి గురయ్యారు. లూసియానా వర్సిటీ పోలీసులకు ఫోన్ చేసిసమాచారం అందించారు. ముగ్గురు దుండగులు అపార్ట్‌మెంట్ నుంచి పారిపోవడం చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డబ్బుకోసం ఉన్మాదుల్లా ప్రవర్తించే వారే ఈ దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి దుండగుల కోసం గాలిస్తున్నారు.
అక్కడే నేరాలు ఎక్కువ...లూసియానా వర్సిటీ సుమారు 2వేల ఎకరాల్లో విస్తరించింది. పెళ్లయిన వారికి కేటాయించిన అపార్ట్‌మెంట్స్.. క్యాంపస్‌కు ఓ చివరన విసిరేసినట్లు ఉంటాయి. అక్కడ నేరాలు కూడా అధికం.భారత సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ కార్యాలయం ఈ అపార్ట్‌మెంట్స్‌కు కూత వేటు దూరంలోనే ఉంటుంది. లూసియానా వర్సిటీలో సుమారు 30వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జార్జియాటెక్ వర్సిటీ కాల్పుల తర్వాత అమెరికాలోని యూనివర్సిటీలో ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. అనుకోని సంఘటనలు జరిగితే పోలీసులను అప్రమత్తం చేసేలా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని వర్సిటీ విద్యార్థులందరికీ సూచించారు. లూసియానా వర్సిటీలోనూ ఫోన్ ద్వారా ఈ మెసేజ్ పంపారు. కానీ... ఇందుకు 8 వేల మంది మాత్రమే స్పందించినట్లు తెలిసింది.
జూన్‌లో వచ్చేస్తానని...కిరణ్ కుమార్ ఐదేళ్లుగా డాక్టరేట్ చేస్తున్నారు. అది ముగింపు దశకు చేరుకుంది. జూన్‌లో భారత్‌కు వచ్చి... ఇక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నారు. అంతలోనే ఈ దారుణం జరిగింది. కిరణ్ విద్యాభ్యాసం మంచిర్యాల, హైదరాబాద్, వరంగల్‌లలో సాగింది. అతని ఇద్దరు సోదరీమణులు రజని, స్వప్నలు కూడా అమెరికాలో ఉన్నారు. సోదరి స్వప్న గర్భవతి కావడంతో ఆమెకు తోడుగా ఉండేందుకు తల్లి శోభ కూడా అక్కడికి వెళ్లారు. కిరణ్ మృతి వార్త తెలియగానే ఆయన బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. తండ్రి రాజయ్య హుటాహుటిన హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు.
పది నెలల క్రితమే...దుండగుల చేతిలో మరణించిన మరో యువకుడు చంద్రశేఖర్ రెడ్డి తండ్రి సాంబశివారెడ్డి రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్. ప్రస్తుతం ఆయన కడప జిల్లా వెలిదండ్ల గ్రామంలో భూములు కొని స్థిరపడ్డారు. ఆయన ముగ్గురు కుమారుల్లోఒకరు హైదరాబాద్‌లో, మరొకరు కర్నూలులో ఉన్నారు. ఇంకో కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి పది నెలల క్రితమే అమెరికా వెళ్లారు. ఆయన భార్య కూడా అక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారు. కిరణ్, చంద్రశేఖర్‌ల మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. సంఘటన వివరాలు తెలుసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
No comments:
Post a Comment