Sunday, December 16, 2007

ఎందుకు చేశారో...! తెలుగుబిడ్డల హత్యోదంతం.. అంతుబట్టని కారణం

తెలుగుబిడ్డల హత్యోదంతం.. అంతుబట్టని కారణం హంతకులకై కొనసాగుతున్న వేట గాలింపుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్సు ప్రణబ్‌, రొనెన్‌లతో మాట్లాడిన వైఎస్‌ దోషులకు శిక్షపడేలా చూడాలని విజ్ఞప్తి వాషింగ్టన్‌, హైదరాబాద్‌
అమెరికాలోని లూసియానా విశ్వవిద్యాలయంలో... తెలుగుబిడ్డలు కె.చంద్రశేఖరరెడ్డి, అల్లం కిరణ్‌ కుమార్‌లను పొట్టనబెట్టుకున్న దుండగుల కోసం వేట కొనసాగుతోంది. శనివారం ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్సును ఏర్పాటుచేసి, హంతకుల కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఇప్పటివరకూ అనుమానితులుగా ఎవరినీ గుర్తించలేదని, ఎలాంటి అరెస్టులూ జరగలేదని అధికారులు చెప్పారు. దోపిడీ కోసమే దుండగులు అపార్టుమెంటులోకి చొరబడినట్లు మొదట భావించారు. ఎలాంటి చోరీ జరగకపోవడంతో ఈ హత్యలు ఎందుకు చేశారో అంతుపట్టడంలేదని విశ్వవిద్యాలయ కులపతి(ఛాన్సలర్‌) సీన్‌ ఓ కొయిఫ్‌ పేర్కొన్నారు. మరోవైపు ఘటనపై హూస్టన్‌లోని భారత దౌత్యకార్యాలయం లూసియానా వర్సిటీ అధికారులతో మాట్లాడి, వివరాలు తెలుసుకుంది. బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఇద్దరు అధికారులను విశ్వవిద్యాలయానికి పంపించింది. చంద్రశేఖరరెడ్డి, కిరణ్‌ కుమార్‌ల మృతికి అమెరికాలోని భారత రాయబారి రొనెన్‌ సేన్‌ తీవ్ర సంతాపం తెలిపారు. నిందితులను పట్టుకొని శిక్షాస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు.
మృతదేహాలను తెప్పించే ఏర్పాట్లు హత్యకు గురైన చంద్రశేఖర రెడ్డి, కిరణ్‌కుమార్‌ల మృతదేహాలను రాష్ట్రానికి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌, విదేశాంగ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీతో, అమెరికాలో భారత రాయబారి రొనెన్‌ సేన్‌తో మాట్లాడారు. ''మృతదేహాలను తెచ్చే విషయమై మేము అమెరికా రాయబార కార్యాలయంతో మాట్లాడుతున్నాం. కిరణ్‌కుమార్‌ తండ్రి అల్లం రాజయ్య ఇప్పటికే అమెరికాకు బయలుదేరివెళ్లారు. లూసియానా గవర్నర్‌ బాబీ జిందాల్‌తో అక్కడి తెలుగు సంఘం సమావేశమైంది'' అని మంత్రి షబ్బీర్‌ అలీ తెలిపారు. మృతదేహాలను తెప్పించే ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు భారత రాయబార కార్యాలయానికి చెందిన అధికారులు లూసియానాకు వెళ్లారని ఆయన చెప్పారు. బంధువులెవరైనా అమెరికాకు వెళ్తామంటే వారి ప్రయాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు.

కుటుంబాలను పరామర్శించండి

కిరణ్‌కుమార్‌, చంద్రశేఖరరెడ్డిల కాల్చివేతపై సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌, విదేశాంగ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీని కోరారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన వారిని హతమార్చడం విషాదకరమన్నారు. కిరణ్‌కుమార్‌, చంద్రశేఖరరెడ్డిల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరామర్శించాల్సిందిగా కరీంనగర్‌, కడప జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖరరెడ్డి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు. మృతదేహాలను రాష్ట్రానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణను ఆదేశించారు.

No comments: